'
English
Advertisement

పోల‌వ‌రానికి పుల్ల పెట్టుడేంది కేసీఆర్‌?

పోల‌వ‌రానికి పుల్ల పెట్టుడేంది కేసీఆర్‌?

ఏపీ ప్ర‌జ‌ల క‌ల‌ల పంట పోల‌వ‌రం ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసింది. అంతేనా.. సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. కీల‌క‌మైన ఎన్నిక‌లకు సంబంధించిన ఏర్పాట్ల‌తో ఏపీ స‌ర్కారు బిజీబిజీగా ఉన్న వేళ కేసీఆర్ స‌ర్కారు చ‌డీచ‌ప్పుడు కాకుండా దాఖ‌లు చేసింది.

ఈ నెల 11న ప్రాజెక్టుపై త‌మ‌కున్న అభ్యంత‌రాల్ని తెలియ‌జేస్తూ సుప్రీంకోర్టు పిటిష‌న్ వేసిన వైనం కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఏపీలో చేప‌డుతున్న ప్రాజెక్టుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక లిటిగేష‌న్ తో కేసులు వేస్తున్న నేప‌థ్యంలో ఏపీ అధికారులు ఒక కంట క‌నిపెడుతూనే ఉన్నారు. తాజా ప‌రిణామాన్ని గుర్తించిన ఏపీ జ‌ల వ‌న‌రుల శాఖ తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్ వివ‌రాల్ని సేక‌రించింది.

అయితే.. స‌ద‌రు పిటిష‌న్లో పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాల‌ని నేరుగా కోర‌కున్నా.. ప్రాజెక్టు కార‌ణంగా తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కు భంగం వాటిల్లుతుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసేలా తాజా పిటిష‌న్ ఉందంటున్నారు. సుప్రీంలో దాఖ‌లు చేసిన పిటిష‌న్ లో మూడు అంశాల్ని ప్ర‌ముఖంగా కేసీఆర్ స‌ర్కారు ప్ర‌స్తావించింది.

అందులో మొద‌టిది.. ప్రాజెక్టు నిర్మాణం కార‌ణంగా బ్యాక్ వాట‌ర్ ఎంత ఎత్తులో ఎంత‌వ‌ర‌కు విస్త‌రిస్తారు?  రెండోది.. ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు.. స‌హాయ పున‌రావాసం కాగా మూడో అంశం.. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ భూభాగంలో   ఉన్న జ‌ల విద్యుత్ కేంద్రాల‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌న్న విష‌యాన్ని త‌మ‌కు స్ప‌ష్టం చేయాల‌ని కోరింది.

త‌మ‌కున్న సందేహాల్ని తీర్చాల‌ని చెబుతూ.. త‌క్ష‌ణ‌మే తాము లేవ‌నెత్తిన అంశాల మీద అధ్య‌య‌నం చేసేలా కేంద్రానికి ఆదేశించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం కోరింది. ఆయా అంశాల మీద అధ్య‌య‌న నివేదిక వ‌చ్చే వ‌ర‌కూ పోల‌వ‌రం ప్రాజెక్టును నిలిపివేయాల‌న్న మాట‌ను త‌ర్వాతి ద‌శ‌లో తెలంగాణ ప్ర‌భుత్వం కోరే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ వాద‌న‌కు మ‌ద్ద‌తుగా గ‌తంలో చోటు చేసుకున్న అంశాల్ని ప్ర‌స్తావిస్తున్నారు. గ‌తంలోనూ ఈ ప్రాజెక్టును నిలిపివేయాల‌ని కోరుతూ కేసీఆర్ కుమార్తె ఎంపీ క‌విత సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన వైనాన్ని ప‌లువురు గుర్తు చేస్తున్నారు. అయినా.. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత త‌మ‌కున్న అభ్యంత‌రాల్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళితే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. లేదంటే.. రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన అధికారులు కూర్చొని మ‌ధ్యే మార్గంలో ఒక నిర్ణ‌యానికి వ‌స్తే మ‌రింత బాగుండేద‌ని.. అలా కాకుండా ప్ర‌తి విష‌యంలోనూ కోర్టు వెళ్ల‌టం అంత స‌రైన విధానం కాద‌న్న మాట వినిపిస్తోంది.

Advertisement
 
Home
News
Photos
తెలుగు