'
English
Advertisement

పోస్ట్ మార్టం రిపోర్టు మీదే అంద‌రి చూపులు!

పోస్ట్ మార్టం రిపోర్టు మీదే అంద‌రి చూపులు!

దివంగ‌త మ‌హానేత‌.. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సోద‌రుడు వైఎస్ వివేకానంద రెడ్డి హ‌ఠ్మాన్మ‌ర‌ణం చాలామందికి షాకింగ్ గా మారింది. తొలుత గుండెపోటుతో ఆయ‌న ప్రాణాలు వ‌దిలిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. కానీ.. ఆయ‌న బాత్రూంలో ర‌క్త‌పుమ‌డుగులో ప‌డి ఉన్నార‌ని.. అక్క‌డే ఆయ‌న ప్రాణం పోయిన‌ట్లుగా చెబుతున్నారు.

బాత్ర‌రూంలో జారి ప‌డ‌టం.. ఆ వెంట‌నే హార్ట్ స్ట్రోక్ కార‌ణంగా మ‌ర‌ణించి ఉంటార‌న్న ప్రాథ‌మిక స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే.. కాసేప‌టికే దీనిపై బోలెడ‌న్ని అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. బాత్రూంలో ఎంత జారి ప‌డితే మాత్రం త‌ల‌కుగాయం కావాలే కానీ.. ముఖం మీద లోతైన గాయం కావ‌టం.. చేతి మీద కూడా గాయం కావ‌టంపైన ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మవుతున్నాయి.

ఇదే అంశాన్ని వివేకానంద రెడ్డి పీఏ  కృష్ణారెడ్డి పోలీసుల‌కు దృష్టికి తీసుకెళ్లి.. మృతిపై అనుమానాలు వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితుడు విజ‌య‌సాయి రెడ్డి సైతం వివేకానంద రెడ్డి మృతిపై సందేహాలు వ్య‌క్తం చేశారు. తొలుత త‌మ‌కు గుండెనొప్పితో మ‌ర‌ణించిన‌ట్లుగా స‌మాచారం అందింద‌ని.. కానీ అక్క‌డి ప‌రిస్థితులు చూస్తే మాత్రం ప‌లు అనుమానాల‌కు తావిచ్చేలా ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

బాత్రూంలో ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉండ‌టం.. త‌లకు బ‌ల‌మైన గాయం త‌గ‌ల‌టం.. ముఖం మీద గాయం.. చేతి మీద కూడా గాయాలు క‌నిపిస్తుండ‌టంతో ఏం జ‌రిగింద‌న్న‌ది ఇప్పుడు పెద్ద మిస్ట‌రీగా మారింది. అయితే..వివేకానంద రెడ్డి మృతిపై వెల్లువెత్తుతున్న సందేహాల‌కు పోస్టుమార్టం రిపోర్ట్ తో స‌మాధానాలు ల‌భించే అవ‌కాశం ఉంది. ప్రాథ‌మిక రిపోర్ట్ మ‌రికొద్ది గంట‌ల్లో వ‌చ్చినా.. పూర్తిస్థాయి రిపోర్ట్ రావ‌టానికి ఒక‌రోజు ప‌డుతుంద‌ని చెబుతున్నారు. ఏమైనా వివేకానంద రెడ్డి పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద‌నే అంద‌రి చూపులు ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Advertisement
 
Home
News
Photos
తెలుగు