ఏపీ రాజకీయ పార్టీల అభిమానుల్లో కొత్త చర్చ ఒకటి మొదలైంది. ఫిబ్రవరి 14న వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి అమరావతి తన నూతన గృహ ప్రవేశం చేస్తున్నారు.. ఆ కారక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ని జగన్ పిలవడం, ఆయన వస్తానని చెప్పడం జరిగాయి. ఈ నేపథ్యంలో పక్క రాష్ట్ర సీఎంను పిలిచిన జగన్ సొంత రాష్ట్రం సీఎం చంద్రబాబును పిలుస్తారా లేదా అన్న చర్చ జరగుతోంది. అంతేకాదు... జగన్ పిలిచినా చంద్రబాబు వస్తారా లేదా అన్న మరో చర్చా సాగుతోంది.
ఇలాంటి చర్చలకు కారణం రాజకీయ పరిస్థితులే. ఏపీలో చంద్రబాబు, జగన్‌ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రధాన ప్రతిపక్షం అయినప్పటికీ వైసీపీ అసలు అసెంబ్లీకి కూడా వెళ్లడం లేదు. ఇద్దరు నేతలూ కొన్నాళ్లుగా వ్యక్తిగతంగానూ విమర్శలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు జగన్ చంద్రబాబును పిలుస్తారా అన్న అనుమానం చాలామందిలో వ్యక్తమవుతోంది.
ఒకవేళ జగన్ పిలిస్తే చంద్రబాబు వస్తారా రారా అన్నది మరో ప్రశ్న. అందుకు కారణాలూ ఉన్నాయి. చంద్రబాబుకు మరో విరోధి అయిన కేసీఆర్ ఈ కార్యక్రమానికి వస్తుండడం... రాజకీయంగా ఈ రెండు వర్గాలు జాతీయ స్థాయిలో వేర్వేరు కూటముల వైపు మొగ్గు చూపతుండడంతో చంద్రబాబు వైఖరి ఎలా ఉంటుందన్న చర్చా ఉంది. జగన్ పిలిచినా చంద్రబాబు రాకపోవచ్చని కొందరు ఊహిస్తుంటే.. పిలిస్తే వెళ్తారని.. కాకపోతే కేసీఆర్ వెళ్లిన సమయంలో కాకుండా వేరే సమయంలో వెళ్తారని భావిస్తున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయ వర్గాల్లో జగన్ గృహప్రవేశం పెద్ద చర్చనే మొదలపెట్టింది.
రాష్ట్రానికి సంబంధించిన పలు కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు జగన్‌ను పిలిచినా ఆయన వెళ్లలేదు. ఇప్పుడు జగన్ తన సొంత కార్యక్రమానికి చంద్రబాబును పిలుస్తారా లేదా అన్నది చూడాలి.