English
Advertisement

త‌క్ష‌ణ‌మే 5వేల కోట్లు కావాలంటూ తెలంగాణ డిమాండ్‌

త‌క్ష‌ణ‌మే 5వేల కోట్లు కావాలంటూ తెలంగాణ డిమాండ్‌

త‌క్ష‌ణ‌మే రూ.5000 వేల కోట్లు కావాలి. ఎవరిది ఈ ప్ర‌తిపాద‌న‌? ఎవ‌రి ముందు ఈ డిమాండ్ ఉంచారు? అయినా రూ.5 వేల కోట్లు వెంట‌నే కావాల‌ని కోరడం ఏంటి? అని అనుకుంటున్నారా? అవును మీ సందేహాల‌న్నీ నిజ‌మే..దానికి స‌మాధానం కూడా అంతే నిజం. ఈ డిమాండ్ చేస్తున్న‌ది తెలంగాణ ప్ర‌భుత్వం. డిమాండ్ ఉంచింది రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు.! ఎందుకంటే...న‌గ‌దు కొర‌త వ‌ల్ల‌! వివ‌రంగా విష‌యాన్ని తెలుసుకుంటే..పెద్దనోట్లను రద్దుచేసిన రోజుల్లో మాదిరిగానే మళ్లీ కరెన్సీ కష్టాలు తలెత్తడంతో అప్రమత్తమైన తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం.. తక్షణమే ఐదు వేల కోట్ల రూపాయల నగదు పంపాలని ఆర్బీఐని కోరింది.

సంక్రాంతి పండుగ ముంగిట ఒక్కసారిగా నగదు కొరత తలెత్తడంతో అవసరాలకు జేబులో డబ్బులేక సామాన్యులు దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకున్నవారు తిరిగి డిపాజిట్ చేయకుండా దాచుకోవడం.. ఫిక్స్‌డ్, రికరింగ్ డిపాజిట్లను వాపసు తీసుకుని వివిధ రంగాలలో పెట్టుబడులకు మళ్లించడంతో నగదు నిల్వలు తరిగిపోయాయి. రూ.2,000 నోట్లు చాలావరకు తిరిగి రావడంలేదు. దేశవ్యాప్తంగా ఇదేపరిస్థితి. పెద్దనోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ దాదాపు రూ.15 లక్షల 90 వేల కోట్ల వరకు ముద్రించగా అందులో కేవలం ఆరు నుంచి ఏడు లక్షల కోట్ల రూపాయల వరకు మాత్రమే ప్రస్తుతం బ్యాంకులలో అందుబాటులో ఉన్నట్టు అధికారిక అంచనా. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ రిసల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్(ఎఫ్‌ఆర్డీఐ) బిల్లును తీసుకురావాలని నిర్ణయించటంతో చాలామంది బ్యాంకులలో ఉన్న తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఉపసంహరించుకున్నారు. ఇంతవరకు డిపాజిట్ల రూపంలో ఉన్న నగదును బంగారం కొనుగోలు, రియల్‌ఎస్టేట్, స్టాక్‌మార్కెట్లకు మళ్లించారు. దీంతో నగదునిల్వలు మరింత తరిగిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో రూ.70 వేల కోట్లు బ్యాంకులలో అందుబాటులో ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం రూ.20 వేల కోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలోనే రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆశ్ర‌యించిన‌ తెలంగాణ రూ.5000వేల కోట్ల‌ను అందించాల‌ని కోరింది.రూ.5వేల కోట్ల‌లో తక్కువ విలువ కలిగిన చిన్ననోట్లను ఎక్కువగా పంపాలని కోరినట్టు ఆర్థిక‌శాఖ‌ అధికారులు చెప్పారు. దీనికితోడు రైతులకు ఎకరాకు నాలుగు వేల రూపాయల చొప్పున అందించనున్న పెట్టుబడి పథకానికి మరో ఆరువేల కోట్ల రూపాయల దాకా అవసరం. అయితే, పెట్టుబడి సహాయాన్ని తమకు చెక్కుల రూపంలో ఇస్తే మంచిదని రైతులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం కూడా చెక్కుల రూపంలో ఇవ్వటానికే మొగ్గు చూపుతూ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఓవైపు పెట్టుబడి సహాయం రూపంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలోనే మళ్లీ నోట్ల సమస్య తెరమీదకు వచ్చింది. బ్యాంకులలో కనీస నగదు నిల్వలు లేక.. ఏటీఎంలలో డబ్బులు రాలక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

వాస్తవానికి 2016 నవంబర్‌లో పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత కొన్ని నెలలవరకు నగదు కొరత వెంటాడింది. సాధారణస్థితికి రావటానికి ఆరునెలలకు పైగా పట్టింది. మొత్తం రూ.15.90 లక్షల కోట్లలో దాదాపు రూ.8 లక్షల కోట్ల వరకు రూ.2,000 నోట్లు ముద్రించారు. మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల వరకు రూ.500 నోట్లు ఉన్నాయి. మిగతా సుమారు నాలుగు లక్షల కోట్ల వరకు తక్కువ విలువ కలిగిన నోట్లున్నాయి. బ్యాంకుల నుంచి రూ.2,000 నోట్లను డ్రా చేసినవారిలో చాలామంది తిరిగి వాటిని డిపాజిట్ చేయకుండా ఇండ్లలో నిల్వ ఉంచి బ్లాక్‌చేయటంతో నగదుకొరత తీవ్రమవుతున్నదని అధికారులంటున్నారు. ముద్రించిన రూ.2,000 నోట్లలో 30% మాత్రమే బ్యాంకుల ద్వారా సర్క్యులేషన్‌లో ఉన్నాయని.. మిగతావన్నీ నల్లధనం రూపంలో చేతులు మారుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎఫ్‌ఆర్డీఐ బిల్లు ప్రజలలో అపోహలను పెంచింది.

Advertisement
 
Home
News
Photos
తెలుగు