English
Advertisement

కోస్తాలో కోడి పందాలకు సై!

కోస్తాలో కోడి పందాలకు సై!

ప్రతి సంవత్సరం లాగే ఈ సంక్రాంతికి కూడా..కోడి పందాల‌తో కోస్తా క‌ల‌క‌ల‌లాడ‌నుంది. ఉమ్మడి హైకోర్టు ఆదేశించినా.. సీఎం చంద్రబాబు వారించినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందాలకు కళ్లెం పడే పరిస్థితి కనిపించడం లేదు. ఉభయగోదావరి జిల్లాల్లో పందెం రాయుళ్లు పోటీలకు సిద్ధపడుతుండగా.. నిర్వాహకులు దర్జాగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా సరదాగా ఈ క్రీడను నిర్వహిస్తామని.. అవసరమైతే హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళుతామని నిర్వాహకులు తెగేసి చెప్తుతున్నారు. కానీ బెట్టింగుల‌తో జోరుగా పందేలు సాగిపోతున్నాయి. పందేలను కట్టడి చేయడం పోలీస్, రెవెన్యూ సిబ్బందికి సవాలుగా మారింది. పందాలను నిలువరించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో చెప్పాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలను హైకోర్టు ఆదేశించింది. పందాలు జరిగితే అందుకు సీఎస్, డీజీపీలే బాధ్యత వహించాలని హెచ్చరించింది. పందాలు భారీగా జరిగే 43 ప్రాంతాల్లో తహసీల్దార్లకు ఇప్పటికే నోటీసులు జారీచేసినట్టు ప్రభుత్వం కోర్టుకు నివేదిక ఇచ్చింది.

ఈ ఏడాది పందాలు కాసేందుకు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, వ్యాపారులు తరలిరానున్న‌ట్లు అంచ‌నాలు వెలువ‌డ‌తున్నాయి. దీంతో కాకినాడ, యానాం, అమలాపురం, మలికిపురం, రాజోలు, తుని, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో లాడ్జీలు, రిసార్టుల్లో ముందస్తుగా బుకింగ్స్ నమోదయ్యాయి. మ‌రోవైపు కాకిడేగ, కాకినెమలి, ఎర్రపొడ కోడి, తెల్లనెమలి, ఎర్రడేగ, పెట్టమారి, కాకిపెట్టమారి వంటి అరుదైన జాతి కోళ్ల ను పందాలకు ఉపయోగిస్తారు. ఈ జాతి కోళ్లను మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేసి ఇక్కడ పెంచుతున్నారు. ఒక్కో కోడికి రోజుకు మేత కోసం రూ.500 ఖర్చుచేస్తున్నట్టు సమాచారం. ఒక్కోకోడిని రూ. 50 వేల నుంచి 2లక్షలకు విక్రయిస్తున్నారు.

అయితే పందాలను ఆపేందుకు పోలీసులు, అధికార యం త్రాంగం సిద్ధమవుతోంది. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ పందాలను నియంత్రించే విషయంలో రాజీపడబోమని తేల్చిచెప్పారు. గ్రామాల్లో పందాలను నిర్వహిస్తే రెవెన్యూ ఉద్యోగులను బాధ్యులను చేస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. నిర్వాహకులపై బైండోవర్ కేసులు నమోదుచేసి రూ.లక్ష పూచీకత్తుపై విడుదల చేస్తున్నారు. గతంలో పందాల కోసం స్థలాలను ఇచ్చిన యజమానులకు నోటీసులిచ్చారు. కోళ్లకు కత్తులు కట్టే వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదుచేశారు. ప్రతి సంవత్సరం కోడిపందాల మాటున కోట్లు చేతులు మారుతున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement
 
Home
News
Photos
తెలుగు