రాజమౌళితో సినిమా అనగానే సదరు హీరో అభిమానులు కనీసం రెండేళ్ల పాటయినా తమ హీరో తెరపై కనిపించడని ఫిక్స్ అయిపోతారు. ఎలాగో ఖచ్చితంగా బ్లాక్బస్టర్ ఇస్తాడు కనుక ఫాన్స్ కానీ, హీరోలు కానీ రాజమౌళి విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయరు. అయితే 'ఆర్.ఆర్.ఆర్'కి మాత్రం ఖచ్చితంగా రిలీజ్ టైమ్ ఫిక్స్ చేసుకుని, హీరోల నుంచి ఎన్ని డేట్స్ కావాలి, ఎప్పటి వరకు కావాలని రాజమౌళి ముందే చెప్పేసాడు. షూటింగ్ పార్ట్ అయితే ఈ ఏడాది చివరకు పూర్తయిపోతుందట. అంటే వచ్చే ఏడాది నుంచి ఎన్టీఆర్, చరణ్ వేరే సినిమాలు చేసుకోవచ్చన్నమాట. ఆర్.ఆర్.ఆర్ వచ్చే వేసవిలో విడుదల కావడమైతే పక్కా.
రాజమౌళి నుంచి వేరే సినిమాలు చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ లభించినా కానీ ఆర్.ఆర్.ఆర్. రిలీజయ్యే వరకు చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా వేరే సినిమాలు మొదలు పెట్టే అవకాశాలు లేవు. ఆ చిత్రానికి వచ్చే ఫలితాన్ని, తద్వారా పెరిగే మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని తదుపరి చిత్రం ప్లాన్ చేసుకోవాల్సి వుంటుంది. అందుకే ప్రస్తుతానికి ఈ ఇద్దరు హీరోలు రాజమౌళి సినిమా తప్ప మరేదీ ఓకే చేయలేదు. ఆర్.ఆర్.ఆర్. పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది కనుక తదుపరి చిత్రాన్ని కూడా అదే రీతిన ప్లాన్ చేయాలనేది ఇద్దరు హీరోల ఐడియా కావచ్చు. అంచేత రాజమౌళి వారికి ముందుగా ఫ్రీడమ్ ఇచ్చేసినా ఇరువురూ కనీసం ఆరు నెలలయినా విరామం తీసుకోవచ్చు.