English
Advertisement

మొన్న శింబు.. ఇప్పుడు ఇంకో హీరో

మొన్న శింబు.. ఇప్పుడు ఇంకో హీరో

కోలీవుడ్లో ఈ మధ్య హీరో హీరోయిన్లపై నిర్మాతలు ఆరోపణలు గుప్పించడం.. వారిపై నిర్మాతల మండలి ఫిర్యాదు చేయడం మామూలైపోయింది. వివాదాస్పద తమిళ హీరో శింబు మీద ఈ మధ్య ఒక కోలీవుడ్ నిర్మాత తీవ్ర ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ‘ఏఏఏ’ అనే సినిమాకు శింబు ఎంతమాత్రం సహకరించలేదని.. అందు వల్లే సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని.. అతడి వల్ల రూ.20 కోట్ల దాకా నష్టం వచ్చిందని మైకేల్ రాయప్పన్ అనే నిర్మాత ఆరోపించాడు. ఈ వివాదం ఇంకా పరిష్కారం కాలేదు. నిర్మాతల మండలిలో ఉంది వ్యవహారం. మరోవైపు త్రిష.. లావణ్య త్రిపాఠి లాంటి హీరోయిన్ల మీదా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.

ఇప్పుడు మరో కోలీవుడ్ హీరో జై కూడా ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నాడు. జై హీరోగా నటించిన ‘బెలూన్’ సినిమా గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అది అంచనాల్ని అందుకోలేకపోయింది. ఫ్లాప్ అయింది. దీంతో నిర్మాత నష్టపోయాడు. ఆ ప్రొడ్యూసర్ ఇప్పుడు సినిమా ఫ్లాపవ్వడానికి జైనే కారణం అంటున్నాడు. అతను షూటింగుకి సహకరించలేదని.. అందువల్లే గత ఏడాది మధ్యలో విడుదల కావాల్సిన ‘బెలూన్’ ఏడాది చివరికి వాయిదా పడిందని.. దాని వల్ల తాను రూ.1.5 కోట్ల దాకా నష్టపోయానని ఆరోపించాడు. జై నుంచి నష్ట పరిహారం ఇప్పించాలని నిర్మాతల మండలిని కోరుతున్నాడు. ఐతే జైకి ఇండస్ట్రీ నుంచి మద్దతు లభిస్తోంది. జై క్రమశిక్షణ కలిగిన నటుడని.. తనతో చేసిన ఏ సినిమాకూ ఇబ్బంది పెట్టలేదని సీనియర్ దర్శకుడు సుందర్ అన్నాడు. మరి ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.

Advertisement
 
Home
News
Photos
తెలుగు