English

కోమ‌టిరెడ్డి త్యాగం..యువ‌కుల‌కు ఆఫ‌ర్‌

కోమ‌టిరెడ్డి త్యాగం..యువ‌కుల‌కు ఆఫ‌ర్‌

కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ నేత‌, సీనియ‌ర్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి త‌న పొలిటిక‌ల్ జ‌ర్నీలో భాగంగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఎమ్మెల్యేగా త‌న‌దైన శైలిలో డైన‌మిజం ప్ర‌ద‌ర్శించిన కోమ‌టిరెడ్డి త‌న రాజ‌కీయ ప్ర‌యాణంలో భాగంగా ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధ‌మయ్యారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌న ప్ర‌క‌టించారు. అంతేకాదు త‌న సీటును త్యాగం చేస్తాన‌ని..యువ‌కుల‌కు అవకాశం ఇస్తాన‌ని ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చారు. తాజాగా న‌ల్ల‌గొండ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ రాక్షస పాలన కొనసాగుతుందని మండిప‌డ్డారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు నల్గొండ నుండి నడుం బిగించామ‌ని కోమ‌టిరెడ్డి తెలిపారు.

ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీలు, పన్నెండు ఎమ్మెల్యేలు గెలిచి కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీకి కానుకగా ఇస్తామ‌ని కోమ‌టిరెడ్డి ప్ర‌క‌టించారు. రాబోయే ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీచేస్తాన‌ని ప్ర‌క‌టించారు. నల్గొండ ఎంపీగా ఐదు లక్షల మెజార్టీ తో గెలుస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేశారు. నల్గొండ ఎమ్మెల్యేగా యువకునికి అవకాశం ఇస్తామ‌న్నారు.హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న మంత్రి జగదీష్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదని ఆయ‌న జోస్యం చెప్పారు. త‌మ ప్రభుత్వంలో బొడ్డుపల్లి లక్ష్మి ఎమ్మెల్సీ గా పని చేస్తారని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబం తిన్న ప్రజల సొమ్ము ప్రతి పైసా కక్కిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుంటుందని వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి గుత్తా సుఖేందర్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిప‌డ్డారు. పిల్లికి బిచ్చం వేయని వ్యక్తి గుత్తా అయితే... అందరిని కలుపుకుని పోయే వ్యక్తి కోమ‌టిరెడ్డి అని అన్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో త‌మ‌కు ప‌ట్టం క‌ట్ట‌డం ఖాయ‌మ‌ని అన్నారు.

Advertisement