English

బీజేపీ ఎంపీకి చుక్క‌లు చూపించిన టీడీపీ

బీజేపీ ఎంపీకి చుక్క‌లు చూపించిన టీడీపీ

క‌లహాల కాపురం అన్న‌ట్లుగా సాగుతున్న టీడీపీ-బీజేపీ బంధం మ‌ధ్య‌నున్న విబేధాలు తారాస్థాయికి చేరుతున్నాయి. కేంద్ర బడ్జెట్ సమర్పణ అనంతరం ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన టీడీపీ, బీజేపీ నేతల వివాదాలు మెల్లమెల్లగా చేతల్లోకి మారుతున్నాయి. ఏకంగా పార్ల‌మెంటు స‌భ్యుడినే ఘెరావ్ చేసే స్థాయికి చేరుకున్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలంలో సోమవారం చోటుచేసుకున్న ఘటన ఈ విషయాన్ని స్పష్టంచేస్తోంది. బీజేపీకి చెందిన నరసాపురం లోక్‌సభ సభ్యుడు గోకరాజు గంగరాజు, ఆ మండల టీడీపీ నేతల మధ్య సోమవారం ప్రత్యక్ష వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ఎంపీ తీరును నిరసిస్తూ ఆయన పాల్గొన్న పలు కార్యక్రమాలను టీడీపీ నేతలు బహిష్కరించారు.

ఆయా పార్టీలు, మీడియాలో ప్ర‌సార‌మైన క‌థ‌నాల ప్ర‌కారం వీరవాసరం మండలంలో ఎంపీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల నిమిత్తం నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతో కలిసి సోమవారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా అండలూరు గ్రామం వద్ద మాజీ ఎంపీపీ, టీడీపీ మండల కమిటీ మాజీ అధ్యక్షుడు వీరవల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది కార్యకర్తలు ఎంపీ గంగరాజుకు వినతిపత్రం ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని గత ఎన్నికల్లో తిరుపతి సభలో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ హామీయిచ్చారని, అయితే ఇంతవరకు రాష్ట్రానికి ఏ విధమైన సాయం అందించలేదని చంద్రశేఖర్ ఎంపీ గంగరాజుతో పేర్కొన్నారు. దీనితో ఎంపీ గంగరాజు కేంద్రం ఏం చేసిందో మీకు తెలుసా, ఇప్పటివరకు చాలా చేసింది అని వ్యాఖ్యానించారు. అయితే ఏం చేసిందో చెప్పండి అంటూ చంద్రశేఖర్ ప్రశ్నించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఎంపీ గంగరాజు ‘ఏమిచ్చిందో తెలుసుకో’ అంటూ చంద్రశేఖర్ చేతిలోని కాగితాలు లాక్కుని, తోసుకుంటూ వెళ్లిపోయారు. దీనితో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని తెలుగుదేశం నేతలను పక్కకు లాగేయడంతో పరిస్థితి చక్కబడింది.

ఆ సమయంలో పక్కనే ఉన్న భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు మౌనంగా ఉండిపోయారు. దీనితో ఆగ్రహోదగ్రులైన టీడీపీ నేతలు ఎంపీ గంగరాజు పాల్గొనే కార్యక్రమాలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. అనంతరం బుధారాయుడు చెర్వు గ్రామం వద్ద ఎంపీ, ఎమ్మెల్యే వస్తున్న కారును నిలుపుచేశారు. ఈ సందర్భంగా వీరవల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ జరిగిన పరిణామాల దృష్ట్యా ఎంపీ కార్యక్రమంలో తామంతా పాల్గొనబోమని ఎమ్మెల్యేకు తెలిపారు.

ఈసందర్భంగా అదే కారులో ఉన్న ఎంపీ గంగరాజు ‘మీరు రాకపోతే పొండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారు ముందుకు పోనివ్వమని డ్రైవర్‌ను ఆదేశించారు. దీనితో టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు పోలిశెట్టి దాసుతో సహా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ తర్వాత ఎంపీ పాల్గొన్న కార్యక్రమాలను బహిష్కరించారు.

Advertisement