English

కోలీవుడ్, టాలీవుడ్‌ కొల్లగొట్టాడు.. ఇక బాలీవుడ్‌కు

కోలీవుడ్, టాలీవుడ్‌ కొల్లగొట్టాడు.. ఇక బాలీవుడ్‌కు

పండిత పుత్ర పరమ శుంఠహ అంటారు. కానీ అందరి విషయంలో ఇలా జరగదు. ఘనమైన వారసత్వాన్ని కొనసాగిస్తూ తండ్రికి తగ్గ తనయులుగా రుజువు చేసుకునేవాళ్లు కూడా చాలామందే ఉంటారు. సినీ పరిశ్రమలో అలాంటి వారసులు కొంతమంది ఉన్నారు. దక్షిణాదిన ఆ కోవలో ముందు చెప్పుకోవాల్సిన పేరు దుల్కర్ సల్మాన్‌దే. మలయాళ సూపర్ స్టార్ మమ్మట్టి వారసత్వాన్నందుకుని సినీ రంగ ప్రవేశం చేసిన దుల్కర్ సల్మాన్.. చాలా త్వరగా తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నాడు.

మామూలుగా వారసులంటే తండ్రిని అనుకరిస్తూ.. తమ సినిమాల్లో తండ్రి రెఫరెన్సులు చూపిస్తూ.. ఫ్యాన్స్‌ను మొబిలైజ్ చేసుకుంటూ.. వాళ్లకు నచ్చే అంశాల మీద దృష్టిపెడుతూ సాగుతుంటారు. కానీ దుల్కర్ ఆ కోవలోకి రాడు. మొదట్నుంచి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసమే ప్రయత్నించాడు. స్టార్ ఇమేజ్.. కమర్షియల్ ఎలిమెంట్స్.. హీరోయిజం అని చూడకుండా నటుడిగా పేరు తెచ్చుకోవడానికే ప్రయత్నించాడు.

కెరీర్ ఆరంభంలోనే విలక్షణమైన.. అద్భుతమైన పాత్రలు చేసి నటుడిగా గొప్ప పేరు సంపాదించాడు. ఇంట గెలిచాక రచ్చ గెలిచే పనిలో పడ్డాడు. తమిళంలో ‘ఓకే కణ్మణి’తో తనదైన ముద్ర వేశాడు. ఇటీవలే ‘మహానటి’తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు. ఇక అతడి కళ్లు బాలీవుడ్ మీద పడ్డాయి. అక్కడ కూడా దుల్కర్ నటించిన డైరెక్ట్ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఆ సినిమా పేరు.. కార్వాన్. అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన ఇర్ఫాన్‌ ఖాన్‌తో దుల్కర్ ఈ చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకుంటుండటం విశేషం. ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించాడు.

గ్రేట్ పెర్ఫామర్ అయినా ఇర్ఫాన్‌ ఖాన్‌ ముందు దుల్కర్ ఎలా తన ప్రత్యేకతను చాటుకుంటాడో చూడాలి. సినిమాల ఎంపికలో ముందు నుంచి తన టేస్టు చూపిస్తున్న దుల్కర్.. తన బాలీవుడ్ డెబ్యూ కోసం ఎంచుకున్న సినిమాలోనూ ప్రత్యేకత చూపించే ఉంటాడని.. అతను బాలీవుడ్లోనూ తనదైన ముద్ర వేయడం ఖాయమని ఆశిస్తున్నారు అభిమానులు. ఆగస్టు 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement